నాయుడుపేట, అక్టోబర్ 5, మహి న్యూస్: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడేరు గ్రామ పరిధిలో అక్రమ గ్రావెల్ తరలింపు వ్యవహారం పరాకాష్టకు చేరింది. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలను బొందపెడుతూ గ్రావెల్ మాఫియా యథేచ్ఛగా దందా సాగిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలని టీడీపీ నాయకుడు నవీన్ డిమాండ్ చేయడంతో ఈ అంశం నియోజకవర్గంలో తీవ్ర సంచలనంగా మారింది.
అధికారుల పర్యటన ఫలితంగా చర్యలేవి.
గ్రావెల్ అక్రమ రవాణాపై స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో, ఆయన స్పందించి క్షేత్రస్థాయి విచారణకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ను పంపించినట్లు తెలిసింది. వీఆర్వో అక్కడికి చేరుకుని లారీలను నిలిపివేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వెళ్లిన కొద్దిసేపటికే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారుల ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా, వీఆర్వో సమక్షంలోనే లారీలు రాకపోకలు సాగించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. “ఎవరికి చెప్పుకున్నా మాకేం భయం లేదనే ధోరణిలో నిర్వాహకులు అధికారులను, చట్టాన్ని సవాల్ చేసే రీతిలో వ్యవహరిస్తున్నారని పూడేరు వాసులు ఆరోపిస్తున్నారు.
దుమ్ము, ధూళితో ప్రమాదకరంగా ప్రయాణం.
పరిమితికి మించి భారీ లోడుతో అతివేగంగా దూసుకెళ్తున్న లారీల వల్ల గ్రామంలో తీవ్ర దుమ్ము ధూళి కమ్ముకుంటోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించక తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం నడుస్తున్న ఈ లారీల శబ్దాలతో గ్రామస్తులు ప్రశాంతత కోల్పోతున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాల్సిందేనా.
చట్టాలను బొందపెట్టి, అధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా సాగుతున్న ఈ అక్రమ గ్రావెల్ దందా వెనుక ఎవరున్నారు, దీనికి ఎవరి అభయహస్తం ఉంది, అన్న కోణంలో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలి. ఈ క్వారీకి అసలు అనుమతులు ఉన్నాయా లేదా తేల్చాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పూడేరు గ్రామస్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
పూడేరులో ఆగని గ్రావెల్ ‘దందా’. అధికారుల ఆదేశాలకు పాతర! వీఆర్వో క్షేత్రస్థాయి పరిశీలన జరిపినా యథేచ్ఛగా లారీల రాకపోకలు. అడ్డూఅదుపూ లేని అక్రమ రవాణా. నిరసన వ్యక్తంచేస్తున్న పూడేరు గ్రామస్తులు. అతివేగం, దుమ్ము ధూళితో రోడ్డు ప్రమాదాల భయంతో కలవరం.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/138
Be the first to share your thoughts on this story!