News that matters, as it happens
Sunday, 13 September 2026
www.mahinewsindia.com
తడ మండలంలో ఉపాధి హామీ నిధుల దోపిడీ..! నకిలీ మస్టర్లు, బోగస్ బిల్లులు ?
తడ, సెప్టెంబర్ 8, మహి న్యూస్: :తిరుపతి జిల్లా తడ మండల వ్యాప్తంగా వికసిత్ భారత్ జీ-రామ్‌జీ ఉపాధి హామీ పథకం అమలులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించాల్సిన చోట కొందరు అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం కారణంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెబుతున్నారు. ప్రతిరోజూ ప్రైవేటు కంపెనీలకు, పరిశ్రమలకు విధుల నిమిత్తం వెళ్తున్న వారి పేర్లు కూడా ఉపాధి హామీ పనుల మస్టర్లలో నమోదు చేసి, వేతనాలు చూపించారని చెబుతున్నారు. వాస్తవంగా పనులు చేయని వ్యక్తుల పేర్లతో హాజరు నమోదు చేసి, నకిలీ మస్టర్ల ఆధారంగా లక్షల రూపాయల బిల్లులు డ్రా చేసినట్లు తెలిసింది. మరోవైపు, స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడితో ఫీల్డ్ స్థాయి సిబ్బంది మార్పులు జరిగాయని మండల ప్రజలు అంటున్నారు. పథకం అమలులో పారదర్శకత లేకుండా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని, గ్రామాల్లో జరిగిన పనుల నాణ్యత, హాజరు నమోదులు, చెల్లింపుల వివరాలుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుపై 60 రోజులు గడిచినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. అవసరమైన రికార్డులు అందించకపోవడం వల్ల అక్రమాలపై ఉన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రజా ధనంతో నడిచే పథకానికి సంబంధించిన సమాచారం బహిరంగంగా ఇవ్వకపోవడం వెనుక మండల అధికారుల ప్రమేయం మెండుగా ఉన్నట్లు సమాచారం. దీనిపై సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల్లో నకిలీ మస్టర్లను గుర్తించడం పెద్ద కష్టమైన విషయం కాదని, హాజరు వివరాలు, బ్యాంకు చెల్లింపులు, పని ప్రదేశాల పరిశీలన ద్వారా వాస్తవాలు బయటపడతాయిని అంటున్నారు. అందువల్ల జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/91