Tuesday, 11 August 2026
News that matters, as it happens
Header-2
BREAKING

బీసీలను మభ్యపెట్టొద్దు.. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

విజయనగరం, మహి న్యూస్, ఆగస్టు 10:  కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి న్యాయం చేయాలని విజయనగరం జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్య వేదిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్‌ను కలిసి బీసీల రిజర్వేషన్లు, వాటికి చట్టబద్ధత కల్పించడంతో పాటు బీసీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు చోడి ఆదినారాయణ, దిమిలి పైడిరాజు, టీవీ దుర్గారావు, ఆతవ ఉదయభాస్కర్, గంట్లాన అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ బీసీలను మభ్యపెడుతోందని ఆరోపించారు. డాక్టర్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ప్రభుత్వం బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి నివేదిక రూపొందించే పనిలో ఉందన్నారు. అయితే అధ్యయన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందో లేదో, దాని సిఫార్సులు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తొందరపడటం బీసీలకు అన్యాయం చేయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, అధ్యయన కమిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రులతో మరో బీసీ రక్షణ కమిటీని ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సేకరించి బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత దాని నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా మరో కమిటీ ఏర్పాటు చేయడం వల్ల బీసీల్లో గందరగోళం నెలకొంటోందని పేర్కొన్నారు. బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నియమించిన బీసీ అధ్యయన కమిటీ నివేదికను, మంత్రులతో ఏర్పాటు చేసిన బీసీ రక్షణ కమిటీ సిఫార్సులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వాటికి రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి. వెంకట్రావు, చెన్న బంగారురాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X