ఈనెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార పాదయాత్రలు
బనగానపల్లె, ఆగస్టు 4 (మహి న్యూస్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు పిలుపునిచ్చారు.
బనగానపల్లెలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం మండల సమితి ఆధ్వర్యంలో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, మెరుగైన భవిష్యత్తును అందించడంలో విఫలమైందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక అసమానతలు తీవ్రమయ్యాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందని పేర్కొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మతపరమైన అంశాలతో ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు నిత్యావసర వస్తువులు, వంటగ్యాస్, రవాణా, విద్యుత్, వైద్యం, విద్య ఖర్చులు నిరంతరం పెరుగుతున్నప్పటికీ ప్రజల ఆదాయాలు అందుకు అనుగుణంగా పెరగడం లేదన్నారు.
ధరల పెరుగుదలను అదుపు చేయాలని, సార్వత్రిక విద్య, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని, మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న నిర్వహించే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న రాజకీయ ప్రచార పాదయాత్రల్లో ప్రజలు పాల్గొనాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి శివయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి. ఎర్రిస్వామి, సీపీఐ నాయకులు శివానాగయ్య, సుబ్రహ్మణ్యం, మహిళా సమాఖ్య మండల కార్యదర్శి స్వరూపతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
0 Comments